Former CIA Officer Richard barlow: పాకిస్థాన్ అణు స్థావరాలపై దాడి ప్రతిపాదనకు ఇందిరాగాంధీ అంగీకారం తెలపలేదు: మాజీ సీఐఏ అధికారి
ఇందిరాగాంధీ అంగీకారం తెలపలేదు: మాజీ సీఐఏ అధికారి

Former CIA Officer Richard barlow: అమెరికా కేంద్ర గూఢచార సంస్థ (సీఐఏ) మాజీ అధికారి రిచర్డ్ బార్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై రహస్య ఆపరేషన్‌కు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సమ్మతి తెలిపి ఉంటే, అనేక సమస్యలు తీరేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయాన్ని తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
కొన్ని నివేదికలు, వెలుగులోకి వచ్చిన కథనాల ఆధారంగా.. పాకిస్థాన్‌లోని కహుతా అణు స్థావరంపై వైమానిక దాడులు చేపట్టేందుకు భారత్, ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడం, వాటిని ఇతర దేశాలకు సరఫరా చేయకుండా నిరోధించడం ఈ దాడి ఉద్దేశం. ముఖ్యంగా, పాకిస్థాన్ నుంచి తన శత్రు దేశమైన ఇరాన్‌కు అణు సాంకేతికత చేరకుండా చూడాలని ఇజ్రాయెల్ భావించింది. అయితే, ఈ రహస్య ఆపరేషన్‌కు ఇందిరాగాంధీ అనుమతి ఇవ్వలేదని ఆ కథనాలు సూచిస్తున్నాయి. 1982 నుంచి 1985 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా ఉన్న బార్లో, ఈ ప్రణాళిక గురించి కేవలం విన్నానని చెప్పారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం సమ్మతించి ఉంటే, చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు.
అదేవిధంగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించేవారేమో అని బార్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, ఆ కాలంలో అఫ్గానిస్థాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికా రహస్య కార్యకలాపాలు చేపట్టింది. ఇజ్రాయెల్ ప్రయత్నాలు ఆ ఆపరేషన్లకు అడ్డుపడతాయనే భావనతో అమెరికా వాటిని వ్యతిరేకించి ఉండవచ్చని ఆయన చెప్పారు. అమెరికా తనపై ఆధారపడటాన్ని పాకిస్థాన్ అవకాశంగా మలచుకుంది. పాక్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (పీఏఈసీ) అప్పటి అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్, అమెరికాను బెదిరించేలా మాట్లాడారు. అమెరికా సహాయంలో ఏమైనా అంతరాయాలు వస్తే, అఫ్గాన్ వ్యవహారంలో తమ సహకారం ప్రభావితమవుతుందని ఆయన వ్యాఖ్యానించినట్లు బార్లో వెల్లడించారు. పాకిస్థాన్ అణు పితామహుడిగా పేరుగాంచిన ఏక్యూ ఖాన్ నేతృత్వంలో కహుతా అణు కేంద్రం స్థాపించబడింది. 1998లో పాక్ తన మొదటి అణు పరీక్షలు నిర్వహించింది.

