విశ్వాసం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి: ప్రధాని మోదీ

Prime Minister Modi: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే జెన్‌-జీ తరం యువతలో అపారమైన విశ్వాసం, సామర్థ్యాలు, ఆత్మస్థైర్యం ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వీరి క్రమశిక్షణ, కఠోర శ్రమతో వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వయసు కాకుండా, చేసే కార్యాలు, సాధించే విజయాలే వ్యక్తిని గొప్పవాడిని చేస్తాయని ఆయన అన్నారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అనేక కార్యాలు చేయవచ్చని ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు మోదీ సలహా ఇచ్చారు.

తాత్కాలిక ఆకర్షణలు, ప్రజాదరణకు లొంగకుండా దేశాభివృద్ధికి కృషి చేసిన మహానుభావుల జీవితాల నుంచి మంచి అంశాలు నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. ఏ అంశంపై అయినా సందేహాలు రాగానే పెద్దలను సంప్రదించాలని ఆయన యువతకు హితవు పలికారు. యువతే దేశ చోదక శక్తి అని, రాబోయే 25 ఏళ్లు దేశాభివృద్ధికి అత్యంత కీలకమని మోదీ పునరుద్ఘాటించారు. యువత కలలు, ఆశయాలే భారత్ దిశానిర్ణయానికి మార్గదర్శకాలవుతాయని, వారి అభిరుచులే అభివృద్ధి మార్గాన్ని చూపిస్తాయని ఆయన అన్నారు.

తాము సాధించిన విజయాలను వ్యక్తిగతంగా కాకుండా దేశ విజయంగా భావించి ముందుకు సాగాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో యువత ముందుకు రావడానికి తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జెన్‌-జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోందని కొనియాడారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story