President Droupadi Murmu: నియామకాల్లో నిజాయితీకి, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వండి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వండి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్యోగ నియామకాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లకు త్వరగా పరిష్కారాలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి ప్రసంగించారు.
“ఈ సదస్సులో పాల్గొనడం నాకు గౌరవకరం. 1950 తర్వాత యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు ప్రారంభమైంది. ఈ వ్యవస్థకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అభ్యర్థుల్లో సమగ్రత, నిజాయితీ అత్యవసరం. నైపుణ్యాల కొరతను శిక్షణ ద్వారా అధిగమించవచ్చు కానీ నిజాయితీ లోపం సహనీయం కాదు” అని రాష్ట్రపతి నొక్కి చెప్పారు.
సాంకేతికతలో ఉద్భవిస్తున్న కొత్త సవాళ్లను ముందుగానే గుర్తించి, పారదర్శకతను బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయికి ఎదిగే సివిల్ సర్వెంట్ల బృందాన్ని తయారు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అవకాశ సమానత్వంతోపాటు ఫలితాల సమానత్వం కూడా సాధించేలా కృషి చేయాలని సూచించారు.
సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, యూపీఎస్సీ చైర్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు.

