Greenfield Highway: గ్రీన్‌ఫీల్డ్ హైవే: హైదరాబాద్‌ను బందరు పోర్టుతో అనుసంధానం చేసే మార్గం ఇలా..!
బందరు పోర్టుతో అనుసంధానం చేసే మార్గం ఇలా..!
Greenfield Highway: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వద్ద బందరు పోర్టు వరకు నిర్మించాలని ప్రతిపాదించిన 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించిన ప్రాథమిక అలైన్‌మెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, కేంద్రానికి పంపింది. ఈ ప్రాజెక్టును ఆమోదించి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతోంది. మొత్తం 297 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే రెండు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), ఐదు జిల్లాలు, సుమారు 100 గ్రామాల మీదుగా సాగనుంది. తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని 40 గ్రామాలు ప్రభావితమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 60 గ్రామాలు ఇందులో ఉంటాయి.
ప్రాథమిక మార్గం ప్రకారం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మరియు రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ముచ్చర్ల సమీపంలోని తిప్పారెడ్డిపల్లి నుంచి ఈ హైవే ప్రారంభమవుతుంది. అమరావతి రాజధాని సిటీ సమీపంలో లంకెలపల్లి మీదుగా మచిలీపట్నం బందరు పోర్టుకు చేరుకుంటుంది. తెలంగాణ సరిహద్దు వద్ద అడవి దేవులపల్లి, గొట్టెముక్కల సమీపంలో ముగుస్తుంది. మార్గంలో వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటలు ఉన్నట్లు ప్రాథమిక సర్వేలో తేలింది. పూర్తి వివరాలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తర్వాతే ఖరారవుతాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డీపీఆర్ కన్సల్టెంట్ల నియామకానికి చర్యలు చేపట్టింది. అక్టోబరు మూడో వారంలో కన్సల్టెన్సీ ఎంపికైతే, డిసెంబరు నాటికి పూర్తి అలైన్‌మెంట్ సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తన అభిప్రాయాలను తెలియజేయలేదు.
తెలంగాణలో ప్రభావితమయ్యే 40 గ్రామాలు (ప్రాథమిక అలైన్‌మెంట్ ప్రకారం):
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: మీర్‌ఖాన్‌పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్‌గూడ, మంది గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్ గౌరెల్లి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా: తమ్మాడపల్లి, అజిలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామ్‌రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మొహమ్మదా పురం, ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవి దేవులపల్లి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావితమయ్యే 60 గ్రామాలు (ప్రాథమిక అలైన్‌మెంట్ ప్రకారం):
కళ్లేపల్లి, దైద, వజీరాబాద్, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురక పాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీరుక్మిణీపురం, పాపాయ పాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హస్సన్‌బండ, అనంతారం, గుడిపాడు, తళ్లూరు, పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లామ్, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజ, నంబూరు, చిలువూరు, పెర్కలపుడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, భద్రిరాజుపాలెం, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం.
