Supreme Court: మరణశిక్షలో ఉరితీతే కొనసాగుతుంది.. ప్రాణాంతక ఇంజెక్షన్‌కు సుప్రీం నో
సుప్రీం నో

Supreme Court: మరణశిక్ష అమలులో ఉరితీయడానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్‌ను వాడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతానికి ఉరితీతే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
2017లో న్యాయవాది రిషి మల్హోత్రా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఉరితీయడం అత్యంత బాధాకరమైన, క్రూరమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రాణాంతక ఇంజెక్షన్, షూటింగ్, ఎలక్ట్రిక్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి పద్ధతుల్లో దోషి కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడని వాదించారు. ఉరితీసిన తర్వాత వ్యక్తి మరణించాడని ప్రకటించడానికి 40 నిమిషాలు పడుతుందని, ఇంజెక్షన్ ద్వారా అయితే ఐదు నిమిషాల్లోనే పూర్తవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సాధ్యమైనంత తక్కువ బాధ కలిగే రీతిలో మరణశిక్షను అమలు చేయాలని ఐరాస తీర్మానం చెబుతోందని కూడా గుర్తుచేశారు.
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు తమ తీర్పే అంతిమం కాదని తెలిపింది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై మెరుగైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లయితే భవిష్యత్తులో ఈ అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి కేంద్రం ఉరిశిక్షను కొనసాగించడానికే సుముఖత వ్యక్తం చేసింది. ఉరిశిక్ష లేదా ఇంజెక్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని దోషికి ఇవ్వాలని కోర్టు సూచించినా, అలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని గత విచారణల్లో కేంద్రం వెల్లడించింది.
ఇదే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫలితంగా మరణశిక్ష అమలు పద్ధతిగా ఉరితీతే ప్రస్తుతం కొనసాగుతుంది.

