CJI Surya Kant: హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై త్వరిత విచారణ కోసం వ్యాజ్యదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే ధోరణి పెరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ హైకోర్టులో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు.


“హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలపై అత్యవసర లిస్టింగ్ లేదా త్వరిత విచారణ కోసం దిశానిర్దేశాలు కోరుతూ వ్యాజ్యదారులు సుప్రీంకోర్టును సంప్రదించే ధోరణి పెరుగుతోంది” అని సీజేఐ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 65,54,788 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 97,201 కేసులు పెండింగ్‌లో ఉండి లక్షకు చేరువగా ఉంది. న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెరిగినా పెండింగ్ కేసులు తగ్గడం లేదు. 25 హైకోర్టుల్లో 1,122 మంది సాంక్షన్ స్ట్రెంగ్త్‌కు గాను 292 ఖాళీలు ఉన్నాయి.


హైకోర్టుల స్వయం ప్రతిపత్తిని, వాటి రోస్టర్లను నియంత్రించే అధికారాన్ని సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ గౌరవిస్తోందని సీజేఐ అన్నారు. అయినప్పటికీ ఇలాంటి అభ్యర్థనల తరచుదనం ప్రక్రియల స్పందనను మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తోందని తెలిపారు. ఈ ప్రశ్నలను హైకోర్టుల విమర్శగా కాకుండా సామూహిక బాధ్యతగా చూడాలని కోరారు. ఆర్టికల్ 226 కింద హైకోర్టులకు ఉన్న అధికారాలు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు అధికారాల కంటే విస్తృతమైనవని గుర్తు చేశారు.


“అత్యవసర విషయాలను మరింత సమర్థవంతంగా గుర్తించగలమా? లిస్టింగ్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, అంచనా వేయదగినవిగా చేయగలమా? జాప్యం తిరుగులేని నష్టం కలిగించే కేసులకు ప్రాధాన్యత ఇవ్వడంలో సాంకేతికత సహాయపడగలదా? వ్యాజ్యదారులకు సకాలంలో న్యాయం అందడం జాతీయ రాజధానికి ప్రయాణించే సామర్థ్యంపై ఆధారపడకుండా చూడగలమా?” అని సీజేఐ ప్రశ్నించారు.


న్యాయ స్వాతంత్య్రం, సామర్థ్యం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, పోటీ లక్షణాలు కావని ఆయన అన్నారు. సకాలంలో, సమర్థవంతమైన పనితీరు న్యాయస్థానాల స్వాతంత్య్రంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. “న్యాయం, అన్యాయం మధ్య తేడా తుది తీర్పులో కాదు.. అవసరమైన సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనే దానిపై ఉంటుంది” అని సీజేఐ సూర్యకాంత్ నొక్కి చెప్పారు.

Next Story