High Drama in Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీలో హోరాహోరీ: టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట, ఘర్షణలు
టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట, ఘర్షణలు

High Drama in Bengal Assembly: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గురువారం తీవ్ర గందరగోళంతో దద్దరిల్లింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం, తోపులాటలు, ఈడ్చివేతలు, జై శ్రీరామ్ నినాదాలు, అరుపులు-కేకలతో సభ అట్టుడికిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై జరుగుతున్న దాడులు, వేధింపులను ఖండిస్తూ తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ వ్యతిరేకులు. బెంగాలీలపై దాడులు, వేధింపులపై అసెంబ్లీలో చర్చను బీజేపీ అడ్డుకుంటోంది. ఇది ఓటు దొంగల పార్టీ” అని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ సభ్యులు సభా కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ బిమన్ బెనర్జీ ఆదేశాల మేరకు మార్షల్స్ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు తరలించారు.
బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్‌ను రోజంతా సస్పెండ్ చేశారు. ఆయన సభ నుంచి వెళ్లడానికి నిరాకరించడంతో మార్షల్స్ వచ్చి ఆయనను బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ఆయన స్పృహ కోల్పోయారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసిరేసుకోవడంతో కొందరికి గాయాలు కూడా అయ్యాయి.
