Dharmendra Pradhan Responds: నేను బాధ్యత తీసుకుంటున్నా: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్
సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan Responds: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థ కారణంగా విద్యార్థుల సమాధాన పత్రాలు తారుమారైనట్లు, మార్కులు తగ్గినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
మూల్యాంకన ప్రక్రియలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదలబోమని విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. “వాటిని సరిచేస్తాం. సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాం” అని ఢిల్లీలో సీబీఎస్‌ఈ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, “98 లక్షల సమాధాన పత్రాల కాపీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. ప్రతి సమాధాన పత్రంలో సగటున 40 పేజీలు ఉంటాయి. దీని ప్రకారం సుమారు 40 కోట్ల పేజీలను స్కాన్ చేశాం. ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అనేది విద్యార్థులకు మేలు చేసే ముందడుగు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ వ్యవస్థను అనుసరిస్తున్నారు. విద్యార్థుల మార్కుల గురించి పారదర్శక సమాచారం అందించడమే లక్ష్యం” అని వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి విమర్శించారు. డిజిటల్ ఇండియా, శాస్త్రీయ పురోగతి వ్యవస్థలను కొందరు పదేపదే వ్యతిరేకిస్తున్నారన్నారు. “రాజకీయాలు తర్వాత చేయొచ్చు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగకుండా చూడటమే ప్రధానం. మార్కులు, వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ విషయాల్లో ఇప్పటికే ఆందోళనలో ఉన్న విద్యార్థులపై మరిన్ని ఒత్తిడులు తెచ్చేలా బహిరంగ ప్రకటనలు చేయొద్దు” అని అన్ని వర్గాలను కోరారు.
సీబీఎస్‌ఈ స్పందన
ఓఎస్‌ఎం విధానంపై సీబీఎస్‌ఈ కూడా స్పందించింది. ఇది సురక్షితమైన ఐటీ ప్లాట్‌ఫామ్ అని, మూల్యాంకన పోర్టల్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలిపింది. సమాధాన పత్రాల స్కానింగ్, ప్రాసెసింగ్‌కు బలమైన డిజిటల్ వ్యవస్థ ఉందని వివరించింది.
ఈ వివాదం నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి IIT మద్రాస్, IIT కాన్పూర్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా సహకరింపజేస్తున్నట్లు సమాచారం.

