India Clarifies: భారత్ పోర్టులను ఇరాన్‌పై దాడులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు నిరాధారం: భారత్ స్పష్టం
ఆరోపణలు నిరాధారం: భారత్ స్పష్టం

India Clarifies: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా భారత ఓడరేవులను (పోర్టులను) ఉపయోగిస్తోందని ఒక మాజీ అమెరికా సైనిక అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం బలంగా ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైనవి, కల్పితమైనవని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా స్పష్టం చేసింది.
అమెరికా ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్‌గ్రెగర్ ఒక అమెరికన్ మీడియా ఛానల్‌లో మాట్లాడుతూ, తమ బేస్‌లు ధ్వంసమయ్యాయని, అందుకే సమీపంలోని భారత నేవీ బేస్‌లను అమెరికా ఉపయోగించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "ఓఏఎన్ (OAN) ఛానల్‌లో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, నకిలీవి. ఇలాంటి నిరాధార, కల్పిత వ్యాఖ్యలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నాం" అని స్పష్టంగా తెలిపింది.
ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్ దేనా-75'పై అమెరికా జలాంతర్గామి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. శ్రీలంక తీరంలో ఈ ఘటన జరగగా, కొంతమందిని శ్రీలంక దళాలు రక్షించాయి. 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నౌక విశాఖపట్నం నుంచి వెళ్తుండగా శ్రీలంక సమీపంలో దాడి జరిగినట్లు సమాచారం.
ఇలాంటి అసత్య ప్రచారాలు భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి, తటస్థతకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రజలు వాటిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇటువంటి నిరాధార ఆరోపణలు దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపకుండా చూడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

