India Expresses Concern: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన- దౌత్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
దౌత్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారం

సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్, ఇజ్రాయెల్ నేతలతో మోదీ ఫోన్ సంభాషణలు
India Expresses Concern: పశ్చిమాసియాలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్‌తోపాటు ఇతర గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 90 లక్షల మంది భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలతో ఫోన్‌లో సంభాషించారు. అన్ని వివాదాలను చర్చలు, పరస్పర సంప్రదింపులు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. దౌత్య చర్చలే శాంతి, స్థిరత్వానికి ఏకైక మార్గమని భారత్ స్పష్టం చేసింది.
సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఆ దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. అక్కడి భారతీయుల క్షేమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరుల రక్షణకు ఆ దేశాలు తీసుకుంటున్న చర్యలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కూడా సంభాషణ జరిపారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో చర్చించారు. ఈ విషయాలను ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
“ప్రాంతీయ పరిస్థితులపై చర్చించాం. తాజా పరిణామాలపై భారత్ ఆందోళనను తెలియజేశాం. పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని స్పష్టం చేశాం. శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలని పునరుద్ఘాటించాం” అని మోదీ రాశారు.
ఈ దౌత్య ప్రయత్నాల ద్వారా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు భారత్ కట్టుబడి ఉందని, భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.

