Prime Minister Narendra Modi: ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU)తో కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఆయన శుభసూచకంగా అభివర్ణించారు. భారత్ ప్రస్తుతం సంస్కరణల దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తున్నాయని వెల్లడించారు. సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదని, అది మానవుల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మోదీ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ వికసిత భారత్ లక్ష్యం వైపు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఎంపీలందరూ ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండటంతో ప్రపంచం భారత్‌ను సుస్థిర దేశంగా చూస్తోందని తెలిపారు.
EUతో కుదిరిన ట్రేడ్ ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మోదీ వివరించారు. దీని ద్వారా భారతీయ తయారీదారులు లబ్ధి పొందాలని, EUలోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేయాలని సూచించారు. సాంకేతికతతో మనం పోటీ పడతామని, దానిని అంగీకరిస్తాం, దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. అయితే, సాంకేతికత ఎప్పటికీ మనుషులను భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని ఇస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

