ప్రధాని మోదీ పిలుపు

Prime Minister Narendra Modi: దేశంలో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా ఉండాలని, దానికి అందరూ సంకల్పం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాణ్యతపై దృష్టి సారించి, ఎలాంటి లోపాలు లేకుండా ఉత్పత్తులు చేయాలని పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లను ఆయన కోరారు.

ఆదివారం (జనవరి 25) నిర్వహించిన 130వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రపంచ దృష్టి మన వైపే ఉందని చెప్పారు. ఈ సమయంలో ఉత్పత్తుల నాణ్యతే అతి ముఖ్యమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

‘‘‘అలా జరిగిపోయిందిలే’, ‘జరుగుతుందిలే’ అనే ఉదాసీనత ఇక మనల్ని ఆవరించకూడదు. దోషాలు, లోపాలు లేని ఉత్పత్తులే మన లక్ష్యం. భారతీయ ఉత్పత్తి అంటేనే అత్యుత్తమ నాణ్యత అనే భావన కల్పించాలి. నాణ్యత... నాణ్యత... నాణ్యత... ఇదే మన మంత్రం. దీని ద్వారానే వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా సాధించగలం’’ అని మోదీ స్పష్టం చేశారు.

స్టార్టప్ ఇండియా కార్యక్రమం 2016లో ప్రారంభమైనప్పుడు దేశంలో 500 కంటే తక్కువ అంకుర పరిశ్రమలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిన ఈ విజయ ప్రయాణానికి భారత యువ ఆవిష్కర్తలే నిజమైన హీరోలని ప్రశంసించారు. ‘‘ఏ రంగంలో చూసినా ఒక భారతీయ స్టార్టప్ ఉంటుంది. యువత ఉత్సాహం, కృషి అద్భుతం’’ అని ఆయన అన్నారు.

అలాగే, 2026ని ‘కుటుంబ సంవత్సరం’గా ప్రకటించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను ప్రధాని మోదీ అభినందించారు.

ఈ సందర్భంగా రేపు (జనవరి 26) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, అందరూ శ్రేష్ఠతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ సూత్రాన్ని అనుసరించి, ‘మేడ్ ఇన్ ఇండియా’ అంటేనే శ్రేష్ఠత అనే సందేశాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story