Bangladesh High Commissioner Summoned: భారత్‌కు బహిరంగ హెచ్చరికలపై స్పందన.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను సమన్స్ చేసిన భారత్
బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను సమన్స్ చేసిన భారత్

Bangladesh High Commissioner Summoned: బంగ్లాదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా భారత్‌పై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌ను ఎవరైనా అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు (సెవెన్ సిస్టర్స్)ను ఒంటరిగా వేరు చేస్తామంటూ ఆయన బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాను భారత విదేశాంగ శాఖ సమన్ చేసింది.
బంగ్లాదేశ్ రాజకీయ నేతలు భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలపై భారత్ అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో తమ ఆందోళనలను హైకమిషనర్‌కు వివరించినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అక్కడ జరిగిన ఇటీవలి సంఘటనలపై భారత్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టకపోవడం, సరైన సమాచారాన్ని భారత్‌తో పంచుకోకపోవడం దురదృష్టకరమని భారత్ అభిప్రాయపడింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయని మరోసారి గుర్తు చేసిన భారత్.. బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం కోసం కోరుకుంటున్నట్లు పేర్కొంది. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికలు జరగాలని ఎప్పటినుంచో కోరుతున్నామని తెలిపింది. అంతేకాకుండా, బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయాలు, పోస్టుల భద్రతను తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతాయుతంగా కాపాడాలని డిమాండ్ చేసింది.
గతేడాది 2024 జులై-ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు జరిగాయి. ఉద్యోగ రిజర్వేషన్ల అంశంపై మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి అల్లర్లుగా మారాయి. ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. చివరకు షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. ప్రాణభయంతో ఆమె దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందారు.
ఆ తర్వాత భారత్ వ్యతిరేక ధోరణికి పేరున్న మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని కొందరు నేతలు భారత్‌పై బహిరంగ విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల హస్నాత్ అబ్దుల్లా చేసిన బెదిరింపు వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.

