Indus Waters: సింధు జలాల ఒప్పందంపై భారత్ కఠిన వైఖరి.. హేగ్ తీర్పు అమోదయోగ్యం కాదని స్పష్టం
అమోదయోగ్యం కాదని స్పష్టం

Indus Waters: భారత్-పాకిస్థాన్ మధ్య కీలకమైన సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ)పై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తాజా తీర్పును భారత్ పూర్తిగా తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై ఆ కోర్టుకు ఎలాంటి అధికారం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంక్ ప్రోద్బలంతో ఈ కోర్టు చట్టవిరుద్ధంగా ఏర్పాటైందని, ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని భారత్ పేర్కొంది. అందువల్ల దాని తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.
1960లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థలోని జలాలను ఇరు దేశాలు ఎలా వినియోగించుకోవాలో నిర్దేశిస్తుంది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ మరోసారి తెలిపింది.
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సోమవారం జారీ చేసిన తీర్పులో ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని, దాన్ని నిలిపివేయడానికి భారత్‌కు సరైన కారణం లేదని పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలపై ఆంక్షలు విధించింది. అయితే ఈ తీర్పును భారత్ పూర్తిగా తోసిపుచ్చింది.
తాజా పరిణామంతో భారత్-పాకిస్థాన్ మధ్య నీటి వివాదం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

