వ్యాపార సంబంధాలు బలోపేతం

India–China: భారత్-చైనా మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలపరచేందుకు భారత ప్రభుత్వం ముఖ్యమైన అడుగు వేసింది. చైనా వృత్తి నిపుణులకు బిజినెస్ వీసాలు త్వరగతిలో అందించేందుకు వీసా నిబంధనల్లో సడలింపులు చేసింది. ఈ మార్పులతో వీసా ఆమోద ప్రక్రియ సమయాన్ని నాలుగు వారాల్లోపు పూర్తి చేసేలా ఏర్పాటు చేశారు. కొన్ని అనవసర పరిశీలనా స్థాయిలను తొలగించడంతో జాప్యాలు తగ్గనున్నాయి. ఇది రెండు దేశాల మధ్య సహకారానికి కొత్త ఊపందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సడలింపులు గత ఆగస్టులో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు నేపథ్యంలోనే వచ్చాయి. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయాలని ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియలో మార్పులు తీసుకురావడం జరిగింది.

2020లో గల్వాన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్ చైనీయులకు వీసాలపై కఠిన ఆంక్షలు విధించింది. బిజినెస్ వీసాల పరిశీలనలు మరింత తీవ్రతరం చేసింది. దీంతో చైనా నిపుణులు భారత్‌లో పనిచేయడానికి వీసాలు పొందడంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. వ్యాపార సంస్థలకు అవసరమైన నిపుణులను త్వరగా పొందవచ్చని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

ఈ మార్పులతో భారత్-చైనా మధ్య వాణిజ్యం మరింత ముందుకు సాగనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story