ప్రతి మూడు విమానాల్లో రెండు లేట్..

IndiGo Flights Delays: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయాలు కొనసాగుతున్నాయి. ప్రతి మూడు ఇండిగో విమానాల్లో రెండు ఆలస్యంగా నడుస్తున్నట్లు తాజా లెక్కలు తెలిసిన కొద్దీ ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. గత రెండు రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన 300కు పైగా విమానాలు రద్దు కావడం విమానయాన రంగంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఇండిగో రోజుకు 2,200 విమానాలు నడుపుతోంది. డిసెంబర్ 2న వీటిల్లో కేవలం 35% మాత్రమే సమయానికి ప్రయాణించాయి. ఇక ప్రభుత్వ అధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలు 38% సరైన సమయానికి చేరాయి. ఇటీవల ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలు ఎక్కువగా దిల్లీ-ముంబయి, దిల్లీ-బెంగళూరు, ముంబయి-బెంగళూరు వంటి కీలక మార్గాల్లో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీ, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమానయాన సంస్థ ప్రతినిధి వివరించారు. బుధవారం దిల్లీ ఎయిర్‌పోర్టులో 38 ఇండిగో విమానాలు, ముంబయిలో 33 విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా గత రెండు రోజుల్లో 300కు పైగా రద్దులు జరిగాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, 48 గంటల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఇండిగో ప్రకటనలో తెలిపింది. ప్రభావిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని హామీ ఇచ్చింది. అయితే, ఆలస్యాలు, రద్దుల వల్ల ఎయిర్ సేవా పోర్టలో ఇండిగోపై ఒక్క రోజులోనే 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.

పైలట్ల కొరతే ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పేర్కొంది. కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తూ, సంస్థతో కలిసి పనిచేస్తున్నామని, విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సంఘటనలు విమానయాన రంగంలో సవాళ్లను హైలైట్ చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story