ఇకపై ఐసోబుటనాల్: నితిన్ గడ్కరీ ప్రకటన

Nitin Gadkari: దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్ కలపడం జరుగుతోంది. ఇప్పటికే E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న అపోహలను కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఇథనాల్‌కు బదులుగా డీజిల్‌లో ఐసోబుటనాల్ కలపాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

డీజిల్‌లో ఇథనాల్ కలపడం విజయవంతం కాలేదని, అందుకే ఐసోబుటనాల్ మెరుగైన ఎంపికగా గుర్తించినట్లు గడ్కరీ తెలిపారు. ఇథనాల్‌ను డీజిల్‌లో కలిపినప్పుడు ఇంజిన్‌లో సమస్యలతో పాటు సాంకేతిక ఇబ్బందులు ఎదురైనట్లు ఆయన వివరించారు. బయోఫ్యూయల్ మిక్సింగ్ విదేశీ కరెన్సీని ఆదా చేయడంతో పాటు భారీ ఇంధన బిల్లుల నుంచి ఉపశమనం కల్పిస్తుందని కేంద్రం భావిస్తోంది.

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌పై సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని గడ్కరీ ఇటీవల వెల్లడించారు. ఈ ప్రచారం పెట్రోల్ లాబీ స్పాన్సర్‌తో రాజకీయంగా ప్రేరేపితమైనదని ఆయన ఆరోపించారు. ఇథనాల్ వల్ల వాహన ఇంజిన్లు పాడవుతాయనే వాదనలను నిరాధారమని కొట్టిపారేశారు. అయితే, కొందరు నిపుణులు ఇథనాల్ వల్ల పాత వాహనాల్లో ఇంజిన్‌లో తుప్పు, రబ్బర్ భాగాలు దెబ్బతినడం, మైలేజ్ తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

డీజిల్‌లో ఐసోబుటనాల్ కలపాలనుకోవడానికి ప్రధాన కారణం, ఇథనాల్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ శక్తి ఉండటం. ఐసోబుటనాల్ కలిపినప్పుడు ఇంజిన్ పనితీరు మెరుగవడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని గుర్తించారు. ఇథనాల్ మాదిరిగానే ఐసోబుటనాల్‌ను కూడా చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఉత్పత్తి చేస్తారు. అయితే, ఐసోబుటనాల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం, దాని శుద్ధీకరణ కోసం కర్మాగారాలకు కొత్త టెక్నాలజీ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story