బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి!

ISRO Achieves Grand Success: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'బాహుబలి' రాకెట్‌గా పిలువబడే LVM-3 M-6 ద్వారా అమెరికాకు చెందిన అతిపెద్ద కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి విజయాన్ని సాధించింది.

ఇది ఇస్రో చరిత్రలో తొలిసారిగా ఇంత భారీ (సుమారు 6,100 కిలోలు) విదేశీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఘటన. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో భాగస్వామ్యంలో చేపట్టిన ఈ వాణిజ్య ప్రయోగం, LVM-3 సిరీస్‌లో 9వ మిషన్‌గా నమోదైంది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడైనా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా 4G, 5G బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. ఎలాంటి అదనపు పరికరాలు అవసరం లేకుండానే అంతరిక్షం నుంచి హై-స్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, వీడియో స్ట్రీమింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఈ విజయంపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ, "బాహుబలి రాకెట్ మరోసారి తన శక్తిని చాటుకుంది. LVM-3 ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో రాకెట్‌ను సిద్ధం చేసి, అమెరికన్ భాగస్వామికి నమ్మకాన్ని కలిగించాం" అని పేర్కొన్నారు. ఈ మిషన్ గగన్‌యాన్ వంటి భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలకు ఇస్రో సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విజయాన్ని అభినందిస్తూ, భారత యువత శక్తితో అంతరిక్ష రంగం మరింత శక్తివంతమవుతోందని, ఇది స్వావలంబనకు బూస్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో ఇస్రో వాణిజ్య రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story