Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గతంలో మాదిరిగా ఇకపై ఎక్కువగా పని చేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మాటలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్కరీ, దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. పార్టీ, ప్రభుత్వం కోసం గతంలో విస్తృతంగా కృషి చేశానని, ఇప్పుడు తన చురుకైన పాత్రను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతకు బాధ్యతలు అప్పగించి, వారికి పని చేసే అవకాశాలు కల్పించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇకపై తీవ్రమైన పాలనా ఒత్తిళ్ల కంటే సామాజిక సంక్షేమం, గిరిజన ప్రాంతాలు, రైతుల శ్రేయస్సుపైనే దృష్టి సారిస్తానని సంకేతాలు ఇచ్చారు. మహారాష్ట్రలో ఏ గిరిజన గ్రామమూ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు. “చేసినంత కాలం చేశాను.. ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి” అని స్పష్టంగా చెప్పారు.

ఈ వ్యాఖ్యలు బీజేపీలో జరుగుతున్న తరాల మార్పు, ఇటీవల పార్టీ సంస్థాగత స్థాయిలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో మరింత చర్చనీయాంశంగా మారాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story