Jubin Garg Death Mystery: జుబీన్ గార్గ్ మృతి కేసు రహస్యం: విషమిచ్చి హత్య.. సింగర్ మరణంలో షాకింగ్ ట్విస్ట్
విషమిచ్చి హత్య.. సింగర్ మరణంలో షాకింగ్ ట్విస్ట్

Jubin Garg Death Mystery: ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మరణ కేసు అనూహ్య మలుపు తిరిగింది. అతని భార్య చెప్పిన మాటల మేరకు, జుబీన్ మరణం సహజమైనది కాదని నిర్ధారణ అయింది. అతని మేనేజర్ సిద్ధార్థ శర్మ, జుబీన్‌ను బలవంతంగా సముద్రంలో ఈతకు తీసుకెళ్లి, కుట్రపూరితంగా విషం ఇచ్చి చంపినట్లు దర్యాప్తులో తేలింది. జుబీన్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, మేనేజర్ వైద్య సహాయం అందించకుండా నిర్లక్ష్యం వహించాడని ఒక సాక్షి వెల్లడించడంతో కేసు మరింత ఉద్ధృతమైంది. ఈ నేపథ్యంలో, అస్సాం ముఖ్యమంత్రి ఈ కేసు విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కుట్రను దాచిపెట్టేందుకు సిద్ధార్థ శర్మ విదేశీ మద్యాన్ని కూడా సమకూర్చాడని విచారణ నివేదికలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 19న సింగపూర్ సముద్రంలో ఈత సమయంలో జుబీన్ గార్గ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అస్సాం సీఎం ఏర్పాటు చేసిన ప్రత్యేక విజిలెన్స్ సెల్ రిమాండ్ రిపోర్టులో సిద్ధార్థ శర్మ కుట్రాస్పద పాత్ర బయటపడింది. దీంతో పోలీసులు శర్మపై నేరపూరిత కుట్ర, హత్య, హత్యానేరం వంటి గంభీరమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు, ప్రత్యక్ష సాక్షి శేఖర్ జ్యోతి గోస్వామి విజిలెన్స్ సెల్‌కు ఇచ్చిన సమాచారం సంచలనం సృష్టించింది. మరణానికి ముందు సిద్ధార్థ శర్మ బలవంతంగా పడవ నియంత్రణను తన చేతికి తీసుకున్నాడని, ఆ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు కుట్ర చేశాడని గోస్వామి తెలిపారు. సిద్ధార్థ శర్మ మరియు అతని సహచరుడు శ్యామకాను మహంత ఉద్దేశపూర్వకంగా జుబీన్‌కు విషం ఇచ్చి హత్య చేశారని, కుట్రను మరుగుపరచడానికి విదేశీ మద్యాన్ని ఉపయోగించారని ఆరోపించారు. జుబీన్ గార్గ్ శిక్షణ పొందిన ఈతగాడు కావడంతో, ఈత కారణంగా మరణించడం అసాధ్యమని గోస్వామి స్పష్టం చేశారు.
అంతేకాకుండా, జుబీన్ చివరి క్షణాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, శర్మ దానిని 'యాసిడ్ రిఫ్లక్స్'గా తేల్చేసి, 'జాబో దే, జాబో దే' (వెళ్లనివ్వండి, వెళ్లనివ్వండి) అని అరిచాడని సాక్షులు వెల్లడించారు. శర్మ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, కుట్రను దాచిపెట్టేందుకు సింగపూర్‌ను ఎంచుకున్నారని, పడవ వీడియోలను ఎవరికీ పంచవద్దని శర్మ సూచించాడని గోస్వామి స్పెషల్ సెల్‌కు తెలియజేశారు.
కాగా, జుబీన్ మరణం పట్ల దేశవ్యాప్తంగా షాక్ వ్యక్తమవుతోంది. దేశంలోని నలుమూలల నుంచి అతని సంగీత అభిమానులు సంతాప సందేశాలు పంపుతూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
