Karnataka Deputy CM DK Shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి స్థానంపై నాయకత్వ మార్పు చర్చలు మళ్లీ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీ సాధించడానికి ఎలాంటి విప్లవం లేదా తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు.

పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలుసని, ఏ సమయంలో తనకు ఏ పదవి ఇవ్వాలనే నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని శివకుమార్ అన్నారు. "నేను రోడ్డు పోరాటాలు చేసినవాడిని, పోరాడటం నాకు తెలుసు. కానీ ఆ పోరాటం అధికారం కోసం కాదు, పార్టీ బయటి శక్తులతో జరుగుతుంది" అని వివరించారు. సీఎం పదవి విషయంపై ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదని, పదవి ఖాళీ అయినప్పుడే మరొకరికి అవకాశం వస్తుందని, అలా కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సహా పార్టీ కేంద్ర నాయకత్వం కర్ణాటక సీఎం మార్పుపై చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలపై తనకు ఎటువంటి సమాచారం లేదని శివకుమార్ చెప్పారు. "పార్టీని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. లక్షలాది కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నాకు దక్కాల్సినది దక్కుతుందనే నమ్మకం, ఆశ నాకుంది" అని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనతో తనకు మధ్య 'పాలు-తేనె' వంటి బంధం ఉందని చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ, విభేదాలు లేవని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను కొట్టిపారేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, తాను ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని శివకుమార్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ గందరగోళం మీద తాత్కాలికంగా తెర పడినట్లు కనిపిస్తోంది.

Next Story