Congress CWC Meeting: ఢిల్లీలో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ కీలక సమావేశం ప్రారంభం
సమావేశం ప్రారంభం

Congress CWC Meeting: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, శశి థరూర్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభానికి ముందు సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల కాలం చేసిన సీనియర్ నేతలు శివరాజ్ పాటిల్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌లకు సంతాపం తెలిపారు.
ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి సీడబ్ల్యూసీ సమావేశం కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించడం, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేయడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు సమీకరించేందుకు దేశవ్యాప్త ఆందోళనల ప్రణాళికను ఖరారు చేయనున్నారు. అదనంగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు, పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపైనా చర్చ జరగనుంది.
పార్టీ బయట నిరసనలు
సమావేశం జరుగుతుండగా, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బయట నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని హోం మంత్రి జి. పరమేశ్వర్‌కు కట్టబెట్టాలంటూ ఆయన మద్దతుదారులు బ్యానర్లు పట్టుకొని డిమాండ్లు చేశారు. పార్టీ అధిష్ఠానం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

