సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్

Ladakh Protests: లడక్‌లో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలకు సూత్రధారిగా భావిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను లేహ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) లేహ్ డీజీపీ నేతృత్వంలోని పోలీసు బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. సెప్టెంబర్ 24న లడక్‌లో జరిగిన అల్లర్లలో నలుగురు మరణించగా, వందలాది మంది గాయపడిన సంఘటనకు వాంగ్‌చుక్ కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ముందురోజు వాంగ్‌చుక్‌కు చెందిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడక్ (SECMOL) ఎన్‌జీఓ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. FCRA నిబంధనల ఉల్లంఘన, విదేశీ నిధుల అవకతవకలు, తప్పుడు రిపోర్టులు సమర్పించడం వంటి ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు.

తన అరెస్టుపై స్పందిస్తూ వాంగ్‌చుక్, "ఈ అరెస్టుతో నాకంటే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రజాభద్రతా చట్టం కింద నన్ను రెండేళ్లు జైలులో పెట్టాలని చూస్తున్నారు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, జైలులో ఉండటం వల్ల ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి," అని అన్నారు.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వాంగ్‌చుక్‌ను హింసకు ప్రేరేపించిన వ్యక్తిగా ఆరోపిస్తూ, అతని చర్యలు బలిపశువు వ్యూహంగా వర్ణించింది. దీనిపై స్పందిస్తూ వాంగ్‌చుక్, తాను అరెస్టుకు సిద్ధమే అని చెప్పారు.

లడక్ హింస నేపథ్యం..

సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో లడక్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలు సెప్టెంబర్ 24న హింసాత్మకంగా మారాయి. లేహ్‌లోని బీజేపీ కార్యాలయంపై దాడులు, దహనం, వీధి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 163 కింద శుక్రవారం (సెప్టెంబర్ 26) లేహ్‌లో 144 సెక్షన్ విధించారు.

లడక్ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అపెక్స్ బాడీ లేహ్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. తమ నిరసనలు శాంతియుతంగా జరిగాయని, సెప్టెంబర్ 24న యువతలో కొంతమంది అదుపు తప్పడంతో హింస చెలరేగిందని వెల్లడించింది.

హింసకు వాంగ్‌చుక్ సంబంధం లేదు: అపెక్స్ బాడీ

లేహ్‌లో జరుగుతున్న నిరాహార దీక్షలకు సోనమ్ వాంగ్‌చుక్ పాత్ర లేదని అపెక్స్ బాడీ లేహ్ తెలిపింది. కేంద్రం చేసిన ఆరోపణలను ఖండించింది. సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న ప్రజలను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడాన్ని విమర్శించింది. వాంగ్‌చుక్ హింసను ప్రేరేపించారని కేంద్రం చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.

Updated On 26 Sept 2025 7:28 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story