CM Suvendu Issues Strong Warning: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై సువేందు అధికారి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. వారిని వారి స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “వెళ్లగొట్టకముందే స్వచ్ఛందంగా పారిపోండి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపిందని సువేందు అధికారి పేర్కొన్నారు. వారిని తిరిగి తీసుకెళ్లడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. చొరబాటుదారులను జైళ్లలో పెట్టొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని, వారికి ఆశ్రయం ఇచ్చి పోషించడానికి మేము ఎవరి బంధువులమా అని ప్రశ్నించారు.

నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు

“గుర్తించండి - తొలగించండి - బహిష్కరించండి” అనే నినాదంతో బెంగాల్ ప్రభుత్వం విదేశీయులను దేశం నుంచి పంపించే కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అక్రమంగా చొరబడిన వారిని తాత్కాలికంగా ఉంచడానికి నిర్బంధ కేంద్రాలు (Holding Centres) ఏర్పాటు చేస్తోంది. మాల్దా జిల్లాలో మొదటి నిర్బంధ కేంద్రం ప్రారంభమైంది. త్వరలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దు వద్ద గుమికూడుతున్న బంగ్లాదేశీయులు

ప్రభుత్వం చర్యలు తీవ్రం చేయడంతో అక్రమ వలసదారులు తమ స్వదేశం వైపు పరుగులు పెడుతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమికూడినట్లు సమాచారం. ‘సర్‌’ (Special Registration) ప్రక్రియ సమయంలో కూడా వందలాది మంది ఈ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న విదేశీయుల చట్టం (Foreigners Act) ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం సువేందు అధికారి స్పష్టం చేశారు.

Next Story