2029 ఎన్నికల నుంచి అమలు!

Union Government: కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచనుంది. ఈ సంబంధిత బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని ప్రకారం లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం 543 నుంచి 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరుతాయి.

ఈ నిర్ణయం 2029 ఎన్నికల నుంచి అమలులోకి వస్తుందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 ఉన్న స్థానాలు 263కి పెంచనున్నారు. లోక్‌సభ సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది.

సోమవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమాచారాన్ని అందజేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లతో కలిసి ఈ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌తో సహా కాంగ్రెసేతర విపక్షాలతో కూడా విడిగా చర్చలు జరిపారు.

మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు చేసి ముందుగా ఆ కోటా అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, సీట్ల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నారు. ఈ పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా సహజంగా పెరుగుతాయని వివరాలు.

2023 సెప్టెంబరులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం 2034 నుంచి 33% మహిళా కోటా అమలు కావాల్సి ఉంది. అయితే రాజ్యాంగ అధికరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1లోపు పూర్తి కాబోతుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా రిజర్వేషన్‌ను ముందుగానే అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story