ప్రతిపక్షాల తీవ్ర నిరసన మధ్య గందరగోళం

Lok Sabha Passes VB–G Ramji Bill: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ – వీబీ జీ రామ్ జీ బిల్లు 2025కు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.

ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన, నినాదాలు, పత్రాలు చించి విసిరిన దృశ్యాల మధ్యే స్పీకర్ ఓం బిర్లా బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత సభను వాయిదా వేశారు.

ఈ బిల్లు ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో 100 రోజులే ఉండేది. కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం ఖర్చు భరించాలి. టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ, గ్రామ సభల అధికారాల్లో మార్పులు కూడా ఉన్నాయి.

ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును మహాత్మా గాంధీ పేరును తొలగించడం, గ్రామీణ పేదల హక్కులను బలహీనపరచడం అంటూ తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. గాంధీ ఫొటోలు చేతబట్టుకొని పార్లమెంట్ లోపల నిరసన తెలిపారు.

గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. “గాంధీజీ పేరు 2009 ఎన్నికల కోసమే పెట్టారు. మనసులో గాంధీజీ ఉన్నారు. ఇది రామరాజ్యం స్థాపనకు, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా తీసుకొచ్చిన చట్టం” అని వాదించారు.

ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు రానుంది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం మరింత రగిలే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story