మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

LPG Cylinder: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.60 పెంచగా, వాణిజ్య సిలిండర్ (19 కేజీ)పై రూ.115 పెంపును చమురు కంపెనీలు అమలు చేశాయి. ఈ కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఫలితంగా హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.965కు చేరుకుంది. అయితే, ఉజ్వల్ యోజన కింద అందించే సబ్సిడీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ధరల పెంపు జరిగినట్టు సమాచారం.

ప్రధాన నగరాల్లో కొత్త ధరల వివరాలు..

గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీ):

దిల్లీ: రూ.913

ముంబయి: రూ.912.50

కోల్‌కతా: రూ.939

చెన్నై: రూ.928.50

వాణిజ్య సిలిండర్ (19 కేజీ):

దిల్లీ: రూ.1883

ముంబయి: రూ.1835

కోల్‌కతా: రూ.1990

చెన్నై: రూ.2043

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరా, లభ్యతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ, "ప్రజలకు సరసమైన ధరల్లో ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో ఇంధన కొరత లేదు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే, పెట్రోల్, డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఖండించింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ విషయంలో భారత్ సుస్థిర స్థితిలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఏవైనా అంతరాయాలు ఏర్పడినా, వివిధ మార్గాల ద్వారా దేశానికి తగినంత ఇంధన సరఫరా జరుగుతోందని వారు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story