208 మంది లొంగుబాటు, 153 ఆయుధాలు అప్పగింత

Maoist Leader Aashanna Surrenders Before Police: మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన తక్కళ్లపల్లి వాసుదేవరావు (ఆశన్న అలియాస్ రూపేష్) పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా 208 మంది మావోయిస్టులు ఆయుధాలను వదులుకుని జనజీవన స్రవంతిలో చేరారు. మావోయిస్టు చరిత్రలో ఇది అతి పెద్ద లొంగుబాటు ఘటనగా నిలిచింది. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. వారు అప్పగించిన 153 ఆయుధాల్లో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు, 1 ఇన్సాస్ ఎల్‌ఎంజీ, 303 రైఫిళ్లు, 11 బీజీఎల్‌లు, 4 కార్బైన్‌లు, 41 బోర్ షాట్‌గన్‌లు, పిస్తోళ్లు తదితరాలు ఉన్నాయి.

ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (అభయ్) 60 మంది సహచరులతో కలిసి లొంగుబాటు చేసిన గంటల తర్వాతే ఆశన్న ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి తీవ్ర అఘాతం కలిగింది. ఇద్దరు కీలక నేతల లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర దెబ్బ తీసింది.

ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం నర్సింగాపూర్ గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో, తర్వాత కాజీపేట ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్య పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)లో చురుకుగా పాల్గొన్నారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతవాసంలోకి వెళ్లిన ఆశన్న ప్రస్తుతం 60 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం.

దండకారణ్య సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా వ్యవహరించిన ఆశన్న, అనేక కీలక దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి పై బాంబు దాడులు, 1999లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్య వంటి ఘటనలకు నేతృత్వం వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ లొంగుబాటును స్వాగతించుతూ, మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతున్నట్లు ప్రకటించాయి. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపాయి.

Updated On 17 Oct 2025 6:52 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story