ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన అవకాశం

Merger of Two NCP Factions: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత ఎన్సీపీ (NCP) రెండు వర్గాల మధ్య విలీన ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఈ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు తెలియజేస్తున్నాయి.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ రెండు వర్గాలు – అజిత్ పవార్ నేతృత్వంలోని ఒక వర్గం, శరద్ పవార్ (NCP-SP) నేతృత్వంలోని మరో వర్గం – విలీనమవుతాయనే ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా ఈ విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని, అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్‌తో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారని తెలుస్తోంది. సుప్రియా సూలే, జయంత్ పాటిల్ వంటి NCP-SP నేతలతో కూడా అజిత్ వర్గం నుంచి చర్చలు జరిగాయి.

ఈ చర్చల గురించి సీనియర్ భాజపా నేతలకు కూడా సమాచారం అందజేశారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విలీనం జరిగిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలనే అంశంపై చర్చలు జరిగాయి. శరద్ పవార్, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ వంటి నేతలు నాయకత్వ జాబితాలో ఉన్నారని సమాచారం.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శరద్ పవార్-అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ అప్పట్లో వెల్లడించారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, రెండు వర్గాల విలీనం జరుగుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఎన్సీపీ నేతలు శుక్రవారం కలిశారు. సీఎం నివాసంలో గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ఛగన్ బుజ్బల్, ప్రఫుల్ పటేల్, ధనుంజయ్ ముండే వంటి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అజిత్ మరణంతో నాయకత్వ లోటును ఎదుర్కొంటున్న పార్టీలో భవిష్యత్ వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ విలీనం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story