దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి: రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh: నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు.

నిజాం ఆగడాలను తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సమర్థతతో హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనమైందని, ఆపరేషన్‌ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని తెలిపారు. పటేల్‌ ముందు నిజాం ఓటమిని ఒప్పుకున్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. సర్దార్‌ పటేల్‌ కలల దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ఆర్టికల్‌ 370 తొలగించి జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, భారత్‌ ఇప్పుడు సాదాసీదా దేశం కాక, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతోందని పేర్కొన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైనికులు సత్తా చాటారని, ఉగ్రవాది మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులను హతమార్చామని, పహల్గాంలో దారుణాలకు పాల్పడిన వారికి బుద్ధి చెప్పామని, ఉగ్రవాద స్థావరాల్లోకి చొచ్చి హతమార్చినట్లు వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతుందని, ప్రస్తుతం తాత్కాలికంగా ఆగినట్లు తెలిపారు.

మజ్లిస్‌కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు గ్రామాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో విముక్తి దివస్‌ జరుపుకుంటుంటే, తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి పేర్లు మార్చి వేడుకలు చేస్తున్నాయని, మజ్లిస్‌కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నాయని విమర్శించారు.

ఆపరేషన్‌ పోలోతో హైదరాబాద్‌కు విముక్తి: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని గౌరవిస్తామని, నిజాం నిరంకుశ పాలనను అంతం చేసేందుకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ పటేల్‌ హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని వివరించారు.

నిజాం బలవంతపు మతమార్పిడులు చేశారు: బండి సంజయ్‌

నిజాం నిరంకుశ పాలన తలచుకుంటే రక్తం మరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఉర్దూను ప్రజలపై రుద్దేందుకు, బలవంతపు మతమార్పిడులు చేసేందుకు నిజాం ప్రయత్నించారని, మతం మారని వారిపై ఎక్కువ పన్నులు విధించారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా రాష్ట్ర పాలకులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story