ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

Narendra Modi: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు ఎన్నో సవాళ్లను తెచ్చిపెట్టాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. గల్ఫ్‌ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, యుద్ధ ఉద్రిక్తతలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎల్పీజీ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, సాధారణ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మోదీ పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఇది సవాళ్లుగా మారిందన్నారు. ‘‘మన దేశానికి ఎక్కువ ముడిచమురు, గ్యాస్‌ గల్ఫ్‌ దేశాల నుంచే వస్తోంది. యుద్ధం వల్ల ఇతర దేశాలతో వాణిజ్యం దెబ్బతింటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వాణిజ్య నౌకల్లో కూడా అనేకమంది భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికీ అవసరమైన సాయం అందిస్తున్నాం. భారత దౌత్య కార్యాలయాలు సాధ్యమైనంత తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని దేశాధినేతలతో ఇప్పటికే రెండుసార్లు మాట్లాడాను’’ అని ప్రధాని వివరించారు.

ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన సమగ్ర సమాచారం అందించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story