Narendra Modi: మహిళా రిజర్వేషన్ల చట్ట అమలుకు అనుబంధ సవరణలు తీసుకురావటానికి రాజకీయ పార్టీలన్నీ ఏకమవ్వాలి: ప్రధాని మోదీ పిలుపు
రాజకీయ పార్టీలన్నీ ఏకమవ్వాలి: ప్రధాని మోదీ పిలుపు

Narendra Modi: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (నారీ శక్తి వందన్ అధినియం) దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేసే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన అనుబంధ సవరణ బిల్లులను ఆమోదించడంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని వివిధ పార్టీల పక్ష నాయకులకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ సవరణలపై చర్చించడానికి ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరగనుంది.
లేఖలో ప్రధాని మోదీ ఇలా పేర్కొన్నారు: “2029 నుంచి మహిళా రిజర్వేషన్ల చట్టం అమలులోకి వస్తే ప్రజాస్వామ్య సంస్థలకు కొత్త బలం చేకూరుతుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం దశాబ్దాలుగా చర్చలకే పరిమితమైంది. మా ప్రభుత్వం 2023లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దేశ జనాభాలో సగం వాటా ఉన్న మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడంలో మా ప్రభుత్వమే ముందడుగు వేసింది. ఇప్పుడు ఆ చట్టాన్ని త్వరితగతిన అమలు చేయడంపై దృష్టి సారించాం.
దేశ మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక పార్లమెంటు సెషన్‌లో ఎంపీలంతా ఏకమై చర్చించాలి. చరిత్రాత్మక మార్పుకు నాంది పలకాలి.”
ఈ ప్రత్యేక సమావేశంలో అన్ని పార్టీలు సహకరించి, మహిళా సాధికారతకు బలం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలు ద్వారా దేశంలోని మహిళలు రాజకీయ రంగంలో మరింత బలంగా నిలవడానికి మార్గం సుగమం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

