NEET Retest: నీట్ రీటెస్ట్: సోషల్ మీడియా వీడియో ఫేక్.. విద్యార్థులు ఆందోళన చెందొద్దు: ఎన్‌టీఏ
ఎన్‌టీఏ

NEET Retest: దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీటెస్ట్ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతంగా ముగిసిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఎన్‌టీఏ స్పందించింది. “అది పూర్తిగా నకిలీ (ఫేక్) వీడియో” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
ఎన్‌టీఏ ప్రకారం, కొందరు కావాలనే అవాస్తవాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారం సృష్టించి విద్యార్థులను ఆందోళనకు గురి చేయడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే వచ్చే సమాచారాన్ని విశ్వసించాలని, తప్పుడు వార్తలను షేర్ లేదా ఫార్వర్డ్ చేయొద్దని విద్యార్థులు, ప్రజలను కోరింది.
ఈ రీ-ఎగ్జామ్‌కు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో 37 రోజుల రికార్డు సమయంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.
గతంలో మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దు చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

