NEET UG: వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ)లో వచ్చే సంవత్సరం (2027) నుంచి గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం పెన్-పేపర్ పద్ధతి నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మారుతోంది. ఇప్పటి వరకు ఒకే రోజులో నిర్వహించే పరీక్షను ఆరు రోజుల వ్యవధిలో విడతలవారీగా దాదాపు 1,000 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

నీట్ యూజీ 2026లో జరిగిన ప్రశ్నపత్ర లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మాదిరిగా నీట్‌ను కూడా బహుళ రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలను మౌలిక సదుపాయాలు, విశ్వసనీయత ఆధారంగా ఎంపిక చేస్తారని అధికారులు చెప్పారు. పూర్తి ప్రణాళిక ఇంకా సిద్ధమవుతోంది.

దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే ఈ పరీక్ష దేశంలోనే అతి పెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటి. ఇందులో దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరుగుతుంది. వీటిలో 56 వేల సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ, 52 వేలు ప్రైవేటు కళాశాలల్లోనూ ఉన్నాయి.

ఈ మార్పులు విద్యార్థులకు మెరుగైన పరీక్ష వాతావరణం కల్పించడంతోపాటు, అక్రమాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీట్ 2026 లీక్ కేసులో దిల్లీ కోర్టు ఇటీవల నిందితుల కస్టడీని పొడిగించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story