భారత్‌కి నవంబర్ 23న అప్పగించే అవకాశం..!

Nirav Modi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయలు మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ దాదాపు పూర్తికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అతడిని భారత్‌కు తీసుకురావడానికి మార్గాలు సుగమమవుతున్నాయని సమాచారం. నవంబర్ 23న నీరవ్‌ను భారత అధికారుల చేతికి అప్పగించే అవకాశం ఉందని ఇంగ్లీష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అప్పగింత ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీలు ఇచ్చింది. నీరవ్‌ను భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత మోసం, మనీలాండరింగ్ కేసుల్లోనే విచారణ చేస్తామని, ఇతర ఏజెన్సీలకు అప్పగించబోమని ఆ హామీలో తెలిపారు. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖలు సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని సమర్పించాయి. అంతేకాకుండా, భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత నీరవ్ మోదీని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతామని, హై ప్రొఫైల్ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలు అందిస్తామని వెల్లడించారు.

తన అప్పగింతను సవాలు చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగిస్తే దేశంలోని వివిధ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో హింసలకు గురిచేస్తాయని అతడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసును మళ్లీ ప్రారంభించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంలో భారత విచారణ సంస్థలు హామీ పత్రాన్ని అందజేశాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం నవంబర్ 23న తదుపరి విచారణలో అతడిని భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.

తప్పుడు ఎల్‌ఓయూలతో పీఎన్‌బీని మోసం చేసిన విషయం 2018 జనవరిలో బయటపడింది. దీంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టాయి. అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయాడు. ఈడీ అతడిని పరారీ ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. నీరవ్ తమ దేశంలో ఉన్నాడని 2018 డిసెంబరులో బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలిపింది. అతడిని అప్పగించాలని భారత్ కోరింది. 2019 మార్చిలో అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అతడిని భారత్‌కు అప్పగించడానికి 2021లో బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో అప్పీలు చేసినా కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసినా ప్రతిసారీ విఫలమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story