యూపీఐ చార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం స్పష్టీకరణ
No misunderstandings on UPI charges - Centre clarifies

దేశంలో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న వేళ, ఈ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనుందన్న వార్తలు గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా రూ.3 వేలకుపైగా ఉన్న లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ చార్జీలను విధించనున్నట్టు వచ్చిన వార్తలను కేంద్రం పూర్తిగా కొట్టిపారేసింది. ఈ ప్రచారం వాస్తవానికి దూరమని, ప్రజల్లో అనవసర ఆందోళనను కలిగించేలా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని మరోసారి స్పష్టం చేసింది.
గతంలో, 2022 వరకు వ్యాపారులు యూపీఐ చెల్లింపులపై బ్యాంకులకు ఒక శాతం లోపు ఎండీఆర్ చార్జీలు చెల్లించేవారు. అయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్ల వినియోగాన్ని పెంపొందించేందుకు కేంద్రం వాటిని పూర్తిగా రద్దు చేసింది. అప్పటి నుంచి బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహణ ఖర్చులకు సంబంధించి కేంద్రం నుంచి సబ్సిడీలు అందుకుంటున్నాయి.
కొన్ని ఆంగ్ల మీడియా కథనాల్లో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్ల నిర్వహణ ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశాయని, అందుకే ఎండీఆర్ చార్జీలను తిరిగి ప్రవేశపెట్టే యోచన జరుగుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వచ్చినా, చార్జీలు వసూలు చేయాల్సి వస్తే అవి వ్యాపారులపైనే ఉంటాయని, వినియోగదారులపై భారం పడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూపీఐ వాడే పౌరులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తంగా చూస్తే.. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ప్రచారం నిజం కాదని, డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో, వినియోగదారులపై భారం లేకుండా కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది.
