Om Birla: తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున ఓం బిర్లా
భారత్ తరఫున ఓం బిర్లా

Om Birla: బంగ్లాదేశ్‌లో నూతన ప్రధాన మంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారతదేశం తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. విదేశాంగ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఫిబ్రవరి 17న ఢాకాలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో మోదీ ఢాకాకు వెళ్లలేరని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఓం బిర్లాను భారత ప్రతినిధిగా పంపాలని నిర్ణయించారు. ఆయనతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించింది. ఈ నెల 17న ఢాకాలోని పార్లమెంటు హౌస్‌లోని సదరన్ ప్లాజాలో ఆయన కొత్త ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే, ఖతార్, శ్రీలంక, నేపాల్, భారత్‌తో సహా 13 దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.
ఓం బిర్లా పాల్గొనడం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న లోతైన, శాశ్వత స్నేహ సంబంధాలను, రెండు దేశాల మధ్య పంచుకునే ప్రజాస్వామ్య విలువలపై భారతదేశం యొక్క దృఢ నిబద్ధతను సూచిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

