Lok Sabha Speaker Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం

Lok Sabha Speaker Om Birla: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలు, అడ్డంకులతో సభా కార్యకలాపాలు తరచూ ఆటంకమవుతున్నాయి. విపక్షాలు తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాలను ఉదహరిస్తూ పీటీఐ వెల్లడించిన కథనం ప్రకారం, విపక్షాలు ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించడానికి నిరాకరించింది. తమ నిర్ణయం కోసం వేచి చూడాలని పేర్కొంది.
ప్రధాన ఆరోపణలు ఏమిటంటే.. రాష్ట్రపతి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వలేదని, అలాగే కాంగ్రెస్ ఎంపీలు, మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణాలతోనే అవిశ్వాస తీర్మానం తీసుకొస్తున్నట్లు సమాచారం.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) తదితర పార్టీలు పాల్గొన్నాయి.
మరోవైపు, పార్లమెంట్‌లో సోమవారం కూడా విపక్షాల నిరసనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో ఖర్గే ప్రసంగానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.

