Vijay Government: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష పార్టీలు నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకుంది. ఆ ఉత్తర్వులను బుధవారం ఉపసంహరించుకుంది.

ఆగస్టు 14న ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, కళాశాల విద్యా కమిషనర్ ఆగస్టు 17న ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, యువత సీజేపీ, వామపక్ష పార్టీల నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని, ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యా విభాగాలు, పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని అత్యవసర అంశంగా పేర్కొని, కళాశాలలు తీసుకున్న చర్యల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఎలాంటి సహేతుకత లేదని సీజేపీ తీవ్రంగా విమర్శించింది. అయితే భాజపా మాత్రం విజయ్ ప్రభుత్వ చర్యను స్వాగతించింది. విద్యార్థులు నిరసనల వైపు ఆకర్షితులు కాకుండా కెరీర్‌పై దృష్టి పెట్టేలా ఉందని పేర్కొంది.

తీవ్ర విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో వామపక్ష పార్టీల మద్దతు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విద్యా సంబంధిత సమస్యలపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వు వివాదాస్పదమైంది.

ప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులకు మద్దతు తెలిపిన వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story