అజిత్-శరద్ పవార్ పక్షాల మధ్య స్థానిక ఎన్నికలకు పొత్తు

Pawar Family Reunites: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు. గతంలో విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటవుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్పీ) మరియు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ పార్టీలు పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పరిణామాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. ఈ కూటమికి తన మామ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.

జనవరి 15న మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తో పాటు 28 మున్సిపల్ కార్పొరేషన్లు, 32 జిల్లా పరిషత్తులు, 336 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. పింప్రీ-చించ్వాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ మాట్లాడుతూ, ‘‘ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలు ఉండవచ్చు. కానీ మహారాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది. పార్టీ కార్యకర్తలు ప్రచారంపై దృష్టి సారించాలి, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి’’ అని సూచించారు.

పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ రెండు పక్షాల మధ్య పొత్తు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పునరేకీకరణ మహారాష్ట్ర రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపనుంది. ఠాక్రే కుటుంబం కూడా స్థానిక ఎన్నికల్లో ఒక్కటైన సంగతి తెలిసిందే. మరాఠీలు, మహారాష్ట్ర హితాల కోసం అన్నీ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో పవార్ కుటుంబం ఐక్యత మరింత ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story