భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ
Narendra Modi is the leader who fulfilled the aspirations of Shyama Prasad Mukherjee

భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు తన మాత్రుమూర్తితో కలిసి మొక్కను నాటారు. అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుని మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం....
దేశం కోసం యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలని జన సంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి పంపిన వీరుడు. పార్టీ, వ్యక్తులు, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే...తన జీవితాన్ని సిద్ధాంతానికి అంకితం చేయడమే కాకుండా అదే సిద్దాంతం కోసం పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ
స్వతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్లమెంట్ లో పోరాడితే... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం శ్యామాప్రసాద్ కు మద్దతు తెలిపారంటే ఆయన గొప్పతనం, కమిట్ మెంట్ ను అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు పార్లమెంట్ లో నెహ్రూ మాట్లాడుతూ ‘నీ పార్టీ ఎంత? నువ్వెంత? నీ పార్టీని మొత్తాన్ని అణిచివేస్తా’నని చెబితే.... అందుకు ప్రతిగా ‘‘నా పార్టీని అణిచివేయడం సంగతి తరువాత చూద్దాం. అణిచివేస్తాననే మీ ఆలోచననే అణిచివేస్తా’’నంటూ ధీటుగా బదులిచ్చిన నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. భారతదేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ఆకాంక్షించిన దూరద్రుష్టి కలిగిన నాయకుడు.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వదేశీయులు కాశ్మీర్ వెళ్లాలంటే పర్మిట్ కార్డు తప్పనిసరి అని విధానం తీసుకొస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ నహీ ఛలేగా...నహీ ఛలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసింది. ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు. ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ ది. ఆయన చనిపోయాక కాశ్మీర్ కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది బీజేపీ సాధించిన తొలి విజయం.
370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలు కన్న ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన మహానేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారతదేశం ఆర్ధిక స్వావలంబన సాధించాలని నిరంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ తపిస్తే... మేక్ ఇన్ ఇండియాతో ఆయన కలలను సాకారం చేసి సిద్ధాంతాల అమలుకు పరిపూర్ణంగా కట్టుబడి పనిచేస్త్తున్న గొప్ప నాయకుడు మోదీ. మోదీ నాయకత్వంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రదేశాలతో పోటీ పడుతోంది. దేశ ప్రజలంతా మోదీ సర్కార్ కు అండగా నిలిచి భారత్ ను విశ్వగురు స్థానంలో నిలపాలనే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఈ కార్యక్రమంలో బీేజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారె్డ్డి, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, మాజీ కార్పరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్ సహా పలువురు నాయకులు హాజరయ్యారు.
