Priyanka Gandhi: ప్రధాని మోడీ అనవసర అంశాలపైనే ప్రసంగాలు.. ప్రియాంక గాంధీ ఎద్దేవా!
ప్రియాంక గాంధీ ఎద్దేవా!

Priyanka Gandhi: దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ‘అవమానాల మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయాలపై మాట్లాడకుండా అనవసర అంశాలపైనే ప్రసంగిస్తున్నారని, రాష్ట్రంలో ఎన్‌డీఏ సర్కారు అవినీతి, దుష్పరిపాలనపై మాత్రం నోరు తెరవడం లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ప్రధాని మోదీ పదేపదే ప్రతిపక్ష నేతలు దేశాన్ని, బిహార్‌ను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని, కాబట్టి ‘అవమానాల శాఖ’ను ఏర్పాటు చేయాలని ప్రియాంక గాంధీ సర్కాస్టిక్‌గా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వరాలు ప్రకటించే ముందు, గత 20 సంవత్సరాల్లో ఎన్‌డీఏ పాలిత్వం ఏం చేసిందో మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బిహార్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నడపడం లేదని, దిల్లీ నుంచి ప్రధాని, ఇతరులు రిమోట్ కంట్రోల్‌లా నియంత్రిస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా సన్నిహిత కార్పొరేట్‌లకు అప్పగించడం వల్ల ఉపాధి కల్పనలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఛఠ్ పూజ, మహా కుంభమేళాలను ప్రతిపక్ష నేతలు అవమానించారంటూ ప్రధాని మోదీ ఆదివారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్‌జేడీ మైత్రి ప్రచారం వేగవంతం కావడంతో ఈ వివాదాలు మరింత తీవ్రతరమవుతున్నాయి.

