Rahul Gandhi: ప్రధాని ‘అమృత్ కాలం’.. దేశ యువతకు ‘విషయుగం’ అయింది: రాహుల్ గాంధీ
దేశ యువతకు ‘విషయుగం’ అయింది: రాహుల్ గాంధీ

Rahul Gandhi: నీట్ యూజీ-2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంతో ఎన్‌టీఏ ఈ నెల 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, త్యాగాలు, కలలు భాజపా పాలనలోని అవినీతి వ్యవస్థ వల్ల నాశనమయ్యాయని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, ‘‘నీట్ పరీక్ష రద్దయింది. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు కఠోర శ్రమ, త్యాగాలు చేశారు. కొందరు తండ్రులు రుణాలు తీసుకున్నారు, తల్లులు నగలు అమ్ముకున్నారు. ఎన్నో రాత్రులు నిద్ర త్యాగం చేసి చదివిన వారికి లభించిన ఫలితం ఏమిటి? పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థలో వ్యవస్థీకృత అవినీతి. ఇది సాధారణ వైఫల్యం కాదు.. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం’’ అని ఆరోపించారు.
పేపర్ మాఫియా ప్రతిసారీ శిక్షలు తప్పించుకుంటుంటే, నిజాయితీపరులైన విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అస్థిరతను భరించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే విద్యకు నిజమైన అర్థం ఏముంటుంది? ప్రధాని మోదీ చెబుతున్న ‘అమృత్ కాలం’.. దేశానికి విషయుగంగా మారింది’’ అని రాహుల్ గాంధీ ఆక్షేపించారు.
ఈ వ్యవహారంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ముఖ. స్టాలిన్ కూడా తీవ్రంగా స్పందించారు. నీట్ వ్యవస్థనే పెద్ద కుంభకోణంగా అభివర్ణించి, పూర్తిగా రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

