ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం! సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో కొలువైన జగన్నాథుడి కోవెల! ఇవాళ ఏడాదికోమారు గుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే అరుదైన సందర్భం. కొత్త రథాలలో ఊరేగుతున్నారు. ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. పూరీ ఆలయం మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ మూల విరాట్టులు ఏటా కొత్త రథంలోనే ఊరేగుతారు. అందుకే జగన్నాథ రథయాత్ర అపురూమయ్యింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

జగన్నాథుడి రథయాత్ర కోసం రెండు నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ రోజున రథ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలవుతాయి. తేరుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. అక్షయ తృతీయ రోజున ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, 125 మంది సహాయకులు కలిసి రథ నిర్మాణం ప్రారంభిస్తారు. వచ్చిన 1072 వృక్ష భాగాలను 2188 ముక్కలుగా ఖండిస్తారు. ఇందులో 832 కలప ముక్కలను జగన్నాథుడి రథం కోసం వినియోగిస్తారు.జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు.45 అడుగుల ఎత్తుండే ఈ మురళీధరుడి రథానికి పదహారు చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలతో ఉన్న పసుపు వస్త్రంతో జగన్నాథుడి రథాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు. 763 ముక్కలను బలరాముడి రథ నిర్మాణం కోసం వాడతారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని పిలుస్తారు. 44 అడుగుల ఎత్తుండే ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ఇక 593 కలప ముక్కలను సుభద్ర రథానికి ఉపయోగిస్తారు. సుభద్రాదేవి ఊరేగే రథాన్ని పద్మధ్వజం అంటారు. 43 అడుగుల ఎత్తుండే ఈ రథానికి పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో ఈ తేరును ముస్తాబు చేస్తారు. ప్రతీ రథానికి 250 అడుగుల పొడవు.. ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథ నిర్మాణాలు పూర్తవుతాయి. ఆలయ తూర్పు భాగాన ఉన్న సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ రథాలను నిలబెడతారు.

ఈ రోజు ఉదయం పూజారులు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లారు. పూజలు చేశారు. శుభముహూర్తం రాగానే రత్నపీఠిక నుంచి విగ్రహాలను కదిలించారు. జగన్నాథ నామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, ఆరుణస్తంభం మీదుగా విగ్రహాలను ఊరేగిస్తూ బయటకు తీసుకొచ్చారు. ముందుగా బలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. తాళధ్వజంపై ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తర్వాత బలరాముడి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర వస్తువులను తీసి భక్తులకు పంచిపెట్టారు. ఆ తర్వాత సుభద్రాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి పద్మధ్వజంపై ప్రతిష్టించారు. అటు పిమ్మట జగన్నాథుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చోబెట్టే వేదికను పహాండీ అంటారు. ఈ సమయంలో ఎవరైనా జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఆలయం నుంచి విగ్రహాలను తీసుకొచ్చేవారిని దైత్యులని పిలుస్తారు.

లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఘోష యాత్ర చాలా నెమ్మదిగా సాగుతోంది. ఎవరైనా పొరపాటున చక్రాల కింద పడినా రథయాత్రను ఆపరు! దారిలో షాపులు అడ్డొచ్చినా రథం ఆగదు. షాపు కూలగొట్టి రథాన్ని ముందుకు తీసుకెళతారు. జగన్నాథుడి ఆలయం నుంచి మూడు మైళ్ల దూరంలో ఉన్న గుండీచా గుడికి రథయాత్ర చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అంత నెమ్మదిగా యాత్ర సాగుతుందన్నమాట! గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి రథాలను అక్కడే నిలబెడతారు. మూలవిరాట్టులు కూడా రథంపైనే ఉంటాయి. మరునాడు ఉదయం మేళతాళాలతో ఆలయంలోకి విగ్రహాలను తీసుకెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన పిదప దశమి రోజున తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్రగా పిలుచుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నానికల్లా మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుంటాయి. ఆ రోజంతా గుడి బయటే ఉంటాయి. మరునాడు ఏకాదశి రోజున బలరామ, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను బంగారు ఆభరణాలతో ఆలంకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని సునావేష అంటారు. ద్వాదశి రోజున విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపైకి చేరుస్తారు. దీంతో యాత్ర పరిసమాప్తమవుతుంది. మూడు రథాలను విరిచేస్తారు.

Next Story