Prime Minister Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ ఒక సుందరమైన ప్రాచీన ప్రేమ కథను ప్రస్తావించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. అయోధ్య యువరాణి సురిరత్న, కొరియా రాజు కిమ్‌ సురో మధ్య దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం ఉదయించిన ప్రేమ-పరిణయం గురించి వివరిస్తూ... “మన భారత్-దక్షిణ కొరియా బంధం ఈనాటిది కాదు, చాలా పురాతనమైనది” అని మోదీ స్పష్టం చేశారు.

ఈ అద్భుతమైన కథ భారత ప్రభుత్వ వెబ్‌సైట్ ‘ఇంక్రెడిబుల్‌ ఇండియా’లో కూడా వివరంగా ఉంది. అయోధ్య యువరాణి సురిరత్నను కొరియాలో ‘రాణి హేయో హాంగ్‌-ఓక్‌’ అని పిలుస్తారు. 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగరం కలిసి ఆ రాణి స్మారక చిహ్నాన్ని సరయూ నది తీరంలో నిర్మించాయి.

కొరియాలోని పురాతన గ్రంథం ‘సంగుక్‌ యుసా’ ప్రకారం, అయోధ్య యువరాణి సురిరత్న సముద్రప్రయాణం చేసి కొరియా చేరుకుని అక్కడ రాజు కిమ్‌ సురోను వివాహం చేసుకున్నారు. ఈ బంధం నుంచి ఉద్భవించిన కారక్‌ వంశీయులు ఇప్పటికీ తమను ఆ యువరాణి వారసులుగానే భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొరియన్లు అయోధ్యలోని సరయూ నది తీరంలోని ఆ స్మారక చిహ్నాన్ని సందర్శించడం ఆనవాయితీగా మారింది.

ఈ చారిత్రక బంధం ప్రస్తావనతో సమావేశం మరింత హృదయస్పర్శిగా మారింది. అధినేతల మధ్య చర్చల అనంతరం పారిశ్రామిక సహకారం, ఉక్కు సరఫరా గొలుసు తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య 15 ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యం నిర్దేశించారు.

ఈ సమావేశం రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే మైలురాయిగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story