భారత్ కట్టుబడి ఉంది - ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Prime Minister Narendra Modi: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో ఉందని, దాని పురోగతి, లక్ష్యాలు, బాధ్యతలను ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏఐని సమర్థవంతంగా వినియోగించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేడ్కర్ సెంటర్ వేదికలపై జరిగే ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ సాయంత్రం ఆవిష్కరించారు.

ప్రపంచ దేశాల నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, టెక్నాలజీ ఔత్సాహికులను ఈ సదస్సు కోసం ఘనంగా స్వాగతిస్తున్నామని మోదీ తెలిపారు. సదస్సు థీమ్ ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’ (అందరి సంక్షేమం)గా ఉంది. మానవాభివృద్ధి కేంద్రంగా ఏఐని తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపారం వంటి రంగాల్లో ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆవిష్కరణ, భాగస్వామ్యంతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన వివరించారు.

ఏఐ ప్రయాణంలో ముందున్నందుకు 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు తెలిపిన మోదీ, ఎక్స్‌పో ప్రారంభం అనంతరం స్టార్టప్ వ్యవస్థాపకులతో మాట్లాడారు. పలు స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. భారత్ మండపంలో ఏర్పాటైన ప్రదర్శనలో రోబోలు, ఇతర ఆవిష్కరణలను సందర్శకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

ప్రపంచ నేతల భారీ హాజరు

ఏఐ సమిట్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, శ్రీలంక, భూటాన్, నెదర్లాండ్స్, గ్రీస్, ఫిన్లాండ్ తదితర 20 దేశాల నేతలు హాజరవుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తోపాటు 40 ప్రముఖ కంపెనీల సీఈవోలు పాల్గొంటున్నారు. హ్యూమన్ సెంట్రిక్‌గా, సమ్మిళితంగా ఏఐ ఉండాలని, వనరులు అందరికీ అందుబాటులో ఉండాలనే సందేశాన్ని భారత్ ఇస్తోందని కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి తెలిపారు.

సదస్సులో 3,250 మంది అతిథులు మాట్లాడనున్నారు. 500 సెషన్లు జరుగుతాయి. ఏఐ యుగంలో ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు, సురక్షిత-నమ్మకమైన ఏఐ, గవర్నెన్స్, మౌలిక వసతులు, జనరేటివ్ ఏఐ డిప్లాయ్‌మెంట్, ప్రభుత్వ రంగ వినియోగం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.

ఎక్స్‌పోకు గూగుల్, ఎన్విడియా, అమెజాన్, మెటా, ఓపెన్‌ఏఐతోపాటు స్థానిక ఏఐ సంస్థలు, 600 స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. 300 స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ తదితర దేశాల సంస్థలు కూడా పాల్గొన్నాయి. 10 వేల మంది భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు. ఎవరైనా హాజరవ్వొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 5 రోజుల్లో 2 లక్షల మందికిపైగా సందర్శకులు హాజరవుతారని అంచనా. డిజి యాత్ర, ఏఐ సదస్సు యాప్‌లలో రిజిస్టర్ చేసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story