Priyanka Gandhi: పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం, రోడ్లపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయించడం ఒకే తరహాలో అప్రజాస్వామిక చర్యలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు.

పార్లమెంట్ సమావేశాలు అప్రజాస్వామికంగా నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రియాంక, తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసుల ద్వారా దాడి చేయించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతు తెలిపినందుకు తమను కూడా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారని ఆమె వెల్లడించారు. విద్యార్థుల హక్కులను కాలరాయడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఎంపీలను గౌరవించకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, శాంతియుత నిరసనలు చేస్తున్న విద్యార్థులను పోలీసులతో కొట్టించడం అన్యాయమని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించకుండా విద్యార్థులు, ప్రతిపక్షాలను అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని అణచివేస్తే లక్షలాది ప్రజలు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు.

విద్యార్థులపై దాడులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నలుపు దుస్తుల్లో లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా తదితర నాయకులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story