ధరలు పెరిగే ప్రమాదం!

Rabi Shock for Farmers: రబీ సీజన్ ప్రారంభానికి ముందే భారతీయ రైతులకు మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. చైనా తన ఎరువుల ఎగుమతులను నిలిపివేయడంతో యూరియా సహా పలు ఎరువుల ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి చైనా యూరియా, డీఏపీ, టీఎమ్‌ఏపీ, అడ్‌బ్లూ వంటి ఎరువుల ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆంక్షలు 5 నుంచి 6 నెలల పాటు కొనసాగవచ్చని అంచనా. భారతదేశం ఈ ఎరువుల్లో 95 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ నిలిపివేతతో దేశంలో ఎరువుల కొరత ఏర్పడి, ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది.

ప్రతి సంవత్సరం భారత్ 2.5 లక్షల టన్నుల ప్రత్యేక ఎరువులను వినియోగిస్తోంది. వీటిలో 60-65 శాతం రబీ సీజన్ (అక్టోబర్ నుంచి మార్చి)లోనే ఉపయోగించబడుతుంది. ఈ కాలంలో ధరల పెరుగుదల రైతులపై తీవ్ర భారం మోపుతుంది. ఇటీవలే యూరియా కొరతతో ఇబ్బందులు పడిన రైతులకు ఇది మరింత కష్టాలను తెచ్చిపెట్టనుంది.

అయితే, పరిశ్రమ వర్గాలు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వ్యాపారులు ఇప్పటికే గణనీయమైన మొత్తంలో ఎరువులను నిల్వ చేశారని, దీంతో రబీ సీజన్ అవసరాలు తీరుతాయని చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story