‘నా నోరు నొక్కితే మీరు గెలిచినట్లు కాదు’

Raghav Chadha: రాజ్యసభలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించబడిన రాఘవ్ చడ్డా తన స్పందనను తీవ్రంగా వ్యక్తం చేశారు. తన గళాన్ని అణచివేయాలని చేసే ప్రయత్నాలు వృథా అని, తనను ఎవరూ ఓడించలేరని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.

గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో రాఘవ్ చడ్డా ఇలా అన్నారు: “పార్లమెంట్‌లో నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజా సమస్యలనే లేవనెత్తాను. బహుశా నేను చర్చించే అంశాలు సాధారణంగా సభలో చర్చకు రావు కావచ్చు. కానీ ప్రజల సమస్యలను ఎత్తి చూపడం ఏమైనా నేరమా? నేనేమైనా తప్పు చేశానా?”

“ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, టోల్ ప్లాజాల్లో జరుగుతున్న దోపిడీ, టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాలు వంటి ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు అది ఆమ్‌ఆద్మీ పార్టీకే లాభం కదా! దీనివల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతోంది? ఎందుకు నన్ను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.

ఆయన మరింత ముందుకు వెళ్తూ, “నా గళాన్ని మీరు అణచివేయవచ్చు... కానీ ఇది నా ఓటమి కాదు. ప్రజలు నా పక్షాన ఉన్నారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నేను నది లాంటి వాడిని. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతా” అని బలంగా ప్రకటించారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం రాఘవ్ చడ్డా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, కార్యక్రమాలపై స్పందించకపోవడం వంటి కారణాలతో ఆయన్ను ఉపనేత పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిత్తల్‌ను నియమించింది. ఈ నిర్ణయం తీవ్ర వివాదాలకు దారితీసింది. చడ్డా భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్న నేపథ్యంలో ఈ పరిణామం దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

రాఘవ్ చడ్డా తన వీడియో సందేశంతో పార్టీ అధిష్ఠానానికి బలమైన సవాల్ విసిరినట్లు స్పష్టమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story