Rahul Gandhi: మహిళా రిజర్వేషన్ ముసుగులో ఎన్నికల ముఖచిత్రం మార్చే కుట్ర: రాహుల్ ధ్వజం
ఎన్నికల ముఖచిత్రం మార్చే కుట్ర: రాహుల్ ధ్వజం

Rahul Gandhi: మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు రాజ్యాంగంపైనే దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో బిల్లు వీగిపోయిన వెంటనే ఆయన మాట్లాడుతూ, “ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధమూ లేదు. భారత ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడమే దీని వెనుక అసలు ఉద్దేశం” అని స్పష్టం చేశారు.
ప్రధాని మహిళలకు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే 2023 చట్టాన్ని తక్షణం అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు సహా మూడు సవరణ బిల్లులపై లోక్‌సభ చర్చలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. “మహిళా రిజర్వేషన్ ముసుగులో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చే కుట్రకు ప్రభుత్వం తెరలేపింది. ఇది దేశ వ్యతిరేక చర్య” అంటూ కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
కులగణనను పక్కన పెట్టి ప్రాతినిధ్యాన్ని కాపాడాలని కుట్ర?
ఓబీసీలు, దళితులు, మైనారిటీలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అధికారపక్షం ఇష్టపడడం లేదని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనను పక్కన పెట్టి ఈ బిల్లుల ద్వారా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. “కులగణన మొదలైందని అమిత్ షా చెప్పారు. కానీ ఇళ్లకు కులం ఉండదని తెలివిగా మాట్లాడారు. సమస్య అది కాదు. లోక్‌సభ, శాసనసభల్లో ప్రాతినిధ్యం కోసం కులగణనను ఉపయోగిస్తారా లేదా అనేదే కీలకం. మరో 15 ఏళ్లపాటు చట్టసభల ప్రాతినిధ్యాన్ని కులగణన నుంచి వేరు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది” అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.
భారత రాజ్యాంగం కంటే మనువాదానికే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందని, ఓబీసీలు-దళితులను హిందువులుగా చెప్పుకున్నా అధికారంలో వారికి చోటు ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నాకు, మోదీకి భార్య సమస్య లేదు’
చర్చలో రాహుల్ ఒక చమత్కార వ్యాఖ్యతో సభను నవ్వించారు. “ప్రధాని నరేంద్ర మోదీకి, నాకు భార్యల సమస్య లేదు. అందుకే వారి నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు” అని అన్నారు. “జాతీయ దృక్పథం, దేశ భవిష్యత్తును ముందుకు నడిపించే గొప్ప శక్తి మహిళలు. మనందరం మన జీవితంలోని మహిళల నుంచి ఎంతో నేర్చుకున్నాం. కానీ మోదీకి, నాకు భార్యలు లేరు కాబట్టి వారి సలహాలు లభించవు. అయితే మాకు తల్లులు, సోదరీమణులు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నవ్వించి.. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేనిది నా సోదరి ప్రియాంక సాధించింది” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
విపక్షాల ఐక్యతతో బిల్లు ఓడింపు
ఈ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమని విపక్ష నేతలు స్వాగతించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ “డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు గళం బలంగా వినిపించాయి. దిల్లీని తమిళనాడు ఓడించింది. ప్రజాస్వామ్యం విజయం సాధించింది” అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే “డీలిమిటేషన్ రూపంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థపై దెబ్బతీయాలని మోదీ-అమిత్ షా ప్రయత్నించారు. దేశ జనాభాలో సగం మహిళలను కవచంగా వాడుకున్నారు. కానీ ఇండియా కూటమి ఐక్యంగా తిప్పికొట్టింది” అని ప్రకటించారు.
సీపీఐ “రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీసే చర్యలకు ప్రతిఘటన ఉంటుందని ఈ బిల్లు ఓడింపు నిరూపించింది” అని తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ “మహిళల హక్కుల్ని హరించే ప్రయత్నాలను అడ్డుకున్నాం. ఇంకెవరూ ఆ ప్రయత్నం చేయకుండా లక్షణ రేఖ గీశాం” అని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ “నోట్ల రద్దు సమయంలో చూపిన తొందరపాటే ఇప్పుడు డీలిమిటేషన్‌పై చూపిస్తున్నారు. ఇది మరో రాజకీయ డీమానిటైజేషన్ అవుతుంది. అలాంటి పని చేయొద్దు” అని హెచ్చరించారు.
విపక్షాల సమిష్టి ప్రయత్నంతో బిల్లు వీగిపోవడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.

